కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2027కు ముందే ముంబై ఇండియన్స్(MI)ను భారీ షాక్ తగిలింది. టీమ్ హెడ్ కోచ్ పదవికి శ్రీలంక వెటరన్ ప్లేయర్ మహేల జయవర్ధనే (Mahela Jayawardene) రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి ఖాళీ అవడంతో ముంబై ఇండియన్స్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను ఉంచుకోవాలా? ట్రేడ్ చేయాలా అన్న విషయంలో ఎంఐ తలమున్కలవుతోంది. ఈ టైమ్‌లో జయవర్ధనే తప్పుకోవడంతో యాజమాన్యంపై ఒత్తిడి పెరిగింది. దశాబ్ద కాలం నాటి అనుబంధానికి ఆయన స్వస్తి పలికారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ శనివారం అధికారికంగా వెల్లడించింది. దీంతో జట్టులో మార్పుల పర్వం మొదలైంది.
నూతన కోచ్ ఎంపిక కోసం యాజమాన్యం వేగంగా పావులు కదుపుతోంది. ఐదుగురు సభ్యులతో కూడిన షార్ట్‌లిస్ట్‌ను సిద్ధం చేసింది. మైఖేల్ హస్సీ, ఆరోన్ ఫించ్ రేసులో ముందంజలో ఉన్నారు. వీరితో పాటు అడ్రియన్ బిరెల్, మార్క్ బౌచర్, ఇయాన్ మోర్గాన్ పేర్లు ఉన్నాయి. వీరికి ఆదివారం నుంచే ఇంటర్వ్యూలు జరగనున్నాయి. త్వరలోనే కొత్త కోచ్ పేరును ప్రకటిస్తారు. కోచ్ రేసులో ఉన్న మైఖేల్ హస్సీకి విస్తృత అనుభవం ఉంది. ఆయన చెన్నై జట్టుకు తొమ్మిదేళ్లు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించారు.
ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్ అందించిన ఆరోన్ ఫించ్ వ్యూహరచనలో దిట్ట. ఇంగ్లాండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ దూకుడు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇస్తారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లను నడిపించే సత్తా ఆయనకు ఉంది. మార్క్ బౌచర్ గతంలో ముంబైకి శిక్షకుడిగా పనిచేశారు. అడ్రియన్ బిరెల్ సాంకేతిక నైపుణ్యం కలిగిన కోచ్. జయవర్ధనే మార్గదర్శకత్వంలో ముంబై జట్టు మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుంది.
2017 నుండి 2022 వరకు, తిరిగి 2024 నుండి 2026 వరకు ఆయన సేవలందించారు. గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్‌గా ముంబై మహిళల జట్టు, ఎంఐ న్యూయార్క్, ఎంఐ ఎమిరేట్స్‌కు ట్రోఫీలు అందించారు. అయితే 2024 సీజన్లో ముంబై ఆఖరి స్థానంలో నిలిచింది. 2026 సీజన్లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
తన నిష్క్రమణపై జయవర్ధనే (Mahela Jayawardene) స్పందిస్తూ ముంబై జట్టుతో ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. యాజమాన్యం నీతా అంబానీ, ఆకాష్ అంబానీ చూపిన నమ్మకాన్ని గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులో ముంబై మరింత విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Also Read : కోహ్లీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ.. ఏబీ షాకింగ్ కామెంట్స్
Follow Us On: Youtube

