ప్రజా ప్రభుత్వంలో ప్రజల ముందుకే అధికార యంత్రాంగం: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: ప్రజా ప్రభుత్వంలో ప్రజల ముందుకే అధికార యంత్రాంగం వచ్చి ప్రజల సమస్యలు విని పరిష్కారం దిశగా అడుగు వేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. వెంటనే పరిష్కారం అయ్యేవి అక్కడికక్కడే, సమయం పట్టే పనులకు ఒక కాలపరిమితిని నిర్ణయించి వాటిని పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో శనివారం వినూత్నంగా చేపట్టిన ‘ప్రజా దర్బార్ (Praja Darbar)’ కార్యక్రమాన్ని రాయిగూడెం క్లస్టర్ పరిధిలో నిర్వహించి మాట్లాడారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరిగే పరిస్థితి ఉండకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఒక సారీ అర్జీ పెడితే చాలు అధికారులే వారి సమస్యలకు పరిష్కారం చూపాలని.. దాన్ని సమన్వయం చేసే గొప్ప కార్యక్రమమే ప్రజా దర్బార్ అని పేర్కొన్నారు. రాయిగూడెం, అజయ్‌తండా, చెరువుమాదారం, మంగాపురం తండా, అప్పలనరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలతో ముఖా ముఖిగా సమావేశమై వారి సమస్యలను సావధానంగా విని, పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ప్రజల కష్టాలు, సమస్యలను వినే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టే ధైర్యంగా ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పొంగులేటి అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని.. గెలిచిన తర్వాత ప్రభుత్వం అందరిదని చెప్పుకొచ్చారు. ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా, ఏ పార్టీ కార్యకర్త అడిగినా.. అది ప్రజా సమస్య అయితే, అడిగిన పని న్యాయమైనదైతే, ప్రజలకు ఉపయోగపడేదైతే కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తన నియోజకవర్గంలో చేస్తున్న ఈ ప్రయోగాత్మక కార్యక్రమం రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయడానికి ఒక నమూనాగా నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 27వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తామని.. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి సమస్యలను పారదర్శకంగా, వడివడిగా పరిష్కరించి ప్రజలకు మేలు చేకూరుస్తామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>