కలం, వెబ్ డెస్క్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు (Parents Protest) తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఫీజుల పెంపునకు సంబంధించి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రామంతాపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నగరంలో పలు ప్రాంతాల్లోనూ నిరసనలు చేపట్టారు.
గత నాలుగేళ్లలో ఫీజులు సుమారు 141% పెరిగినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఫీజులను ఐదు సంవత్సరాల పాటు పెంచకుండా ఫ్రీజ్ చేయాలని, లిఖితపూర్వక హామీ వచ్చే వరకు ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించబోమని ప్రకటించారు. అదనంగా, పాఠశాలలో పారదర్శకత లేకపోవడం, విద్యా ప్రమాణాలు తగ్గడం, పీటీఏం (పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

