వరంగల్‌లో పేకాట జోరు.. ఇండ్లే క్లబ్బులు

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) కమిషనరేట్ పరిధిలో పేకాట జోరుగా కొనసాగుతోంది. ఇల్లే క్లబ్బులుగా మార్చుకున్న పేకాట రాయుళ్లు ఆటలో జోరు పెంచుతున్నారు. వారి ఆటకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కళ్లెం వేస్తున్నప్పటికీ తరచూ అడ్డాలు మారుస్తూ తమ దందాను నడుపుతున్నారు. అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడుతున్నప్పటికీ చిన్నపాటి జరిమానాలతో బయటకు వచ్చి మళ్లీ జూదం నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో పేకాట రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో పేకాట ను అరికట్టడం పోలీసులకు సవాల్ గా మారింది.

ఇండ్లే క్లబ్బులు..

తెలంగాణలో కొన్నేళ్ళ కిందట పేకాట క్లబ్బులు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది ప్రొఫెషనల్ ఆటగాళ్లు గోవా, బెంగళూరు, శ్రీలంక లాంటి పర్యాటక ప్రాంతాల్లో పేకాట నిర్వహించే ప్రాంతాలకు వెళ్లడం మొదలెట్టారు. అక్కడికి వెళ్లడం ఖర్చుతో కూడుకోవడం, స్థానికంగా పనులకు ఆటంకం కలుగుతుండడంతో లోకల్ గానే పేకాట డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని ఖాళీ ఇళ్లు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, ఫామ్ హౌస్‌లను పేకాట క్లబ్బులుగా మార్చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై లక్షల వరకు పందెం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పేకాట నిర్వాహకులు రోజువారీగా ఆటగాళ్ళ నుంచి 10 శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఎవరొచ్చినా తెలిసేలా సీసీ కెమెరాలు, వాచ్‌మెన్లు పెట్టి పక్కాగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపుల ద్వారా మాత్రమే లొకేషన్లు, ఆహ్వానాలు పంపిస్తూ గుట్టు చప్పుడు కాకుండా దందాను నిర్వహిస్తున్నట్లు సమాచారం. మూడు రోజుల కిందట హనుమకొండ అశోక్ కాలనీలో ఓ రియల్టర్ ఇంట్లో పేకాట డెన్ పై దాడి చేసిన పోలీసులు సుమారు 18 మందిని అదుపులోకి తీసుకొని పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేసినట్లు సమాచారం.

పట్టుబడుతున్నా ఆగని ఆట..

వరంగల్ (Warangal) టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట డెన్ల పై నిఘా పెట్టారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తూ పెద్ద సంఖ్యలో పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ దాడుల్లో రాజకీయ నాయకులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, టీచర్లు ఎక్కువగా పట్టుబడుతున్నారు. గత మూడు నెలల్లో జరిపిన దాడుల్లో సుమారు వంద మంది వరకు పట్టుబడినట్లు పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రైడ్‌లో రూ.3 లక్షల వరకు కూడా సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి.

సీపీ వార్నింగ్..

పేకాట ఆడినా, ఆడించినా కేసులు తప్పవని, రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం అని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టడంతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ దెబ్బకు కొంత కంట్రోల్ వచ్చినా, లొకేషన్ మార్చి మళ్లీ క్లబ్స్ నడుపుతుండటంతో పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా పేకాట నిర్వహిస్తున్నట్లు తెలిస్తే 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>