కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆటోవాలాగా మారారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో తన ఇంటి నుండి స్వయంగా ఆటోను నడుపుకుంటూ బయలుదేరారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్యాసింజర్ సీట్లో కూర్చోగా, పక్కనే హిందుత్వ నినాదాలను ప్రచారం చేస్తున్న ఆటో డ్రైవర్ భరత్ ను పక్కనే కూర్చోపెట్టుకుని జ్యోతి నగర్, మంకమ్మ తోట, గీతాభవన్ చౌరస్తా, ప్రతిమ చౌరస్తా, బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బోయవాడ మీదుగా లక్ష్మీనగర్ దాకా ఆటో నడిపారు. వివరాల్లోకి వెళితే…
వనపర్తి జిల్లాకు చెందిన చంచరి భరత్ కుమార్(24) తన ఆటో వెనుక కవర్ పై ‘‘Changing your religion is like your father (నీ మతాన్ని మార్చుకోవడం అంటే నీ తండ్రిని మార్చుకోవడం లాంటిది), Anyone born on this earth is a hindu… jai Sriram (ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే… జై శ్రీరామ్) అని నినాదాన్ని రాయించుకున్నారు. ఈనెల 13న భరత్ ప్యాసింజర్ ను ఎక్కించుకుని మెహిదీపట్నం నుండి జీడిమెట్లకు వెళుతుండగా మజ్లిస్ పార్టీకి చెందిన నలుగురు యువకులు ఆటోను వెంబడించారు.
‘ఆటో వెనుక ఏం రాసినవ్ రా… ఏమనుకుంటున్నవ్ రా…ఆ స్లోగన్స్ తీసేస్తావా? లేదా?’’ అంటూ బండ బూతులు తిట్టి ఆటో కవర్ వెనుకనున్న నినాదాలను పీకేశారు. ఆటో కవర్ ను చించి వేశారు. కొద్దిసేపటి తరువాత అత్తాపూర్ ఎస్ఐ శ్రీనివాసులు ఫోన్ చేసి ‘‘ఆటోమీద అట్లాంటి స్లోగన్స్ ఎట్లా రాస్తావ్? హైదరాబాద్లో ఆటో తిరగాలని ఉందా? లేదా? వెంటనే స్టేషన్కు రా.. నీమీద కంప్లయింట్ వచ్చింది. రాకపోతే నీ ఆటోను సీజ్ చేస్తా’’అంటూ బెదిరించారు.
దీంతో భరత్ స్థానిక బీజేపీ నేతలను వెంట బెట్టుకుని రెండు రోజుల క్రితం కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. ఫోటోలు, వీడియోలు చూపించారు. వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘బాధపడొద్దు. నేను అండగా ఉంటా’’అని భరోసా ఇవ్వడమే కాకుండా హిందుత్వ సిద్దాంతాన్ని నమ్మి ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నందుకు అభినందించారు. పాత ఆటో స్థానంలో కొత్త ఆటో ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఈరోజు భరత్ ను పిలిపించి కొత్త ఆటో ఇవ్వడంతోపాటు హిందుత్వ నినాదాలతోనున్న పాత ఆటోను స్వయంగా నడుపుకుంటూ దాదాపు 5 కి.మీలు వరకు వెళ్లడం విశేషం.
మరోవైపు కరీంనగర్ లోని 38వ డివిజన్ లోని అమీర్ నగర్, లక్ష్మీనగర్ లో రూ.70 లక్షల విలువైన యూఐడీఎఫ్ నిధుల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 3వ డివిజన్ లోని విద్యారణ్యపురి బతుకమ్మ సర్కిల్ వద్ద రూ.48.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతోపాటు పలువురు బీజేపీ నేతలతోపాటు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

