కలం, వరంగల్ బ్యూరో : కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన కేసు మిస్టరీని పరకాల (Parakala) పోలీసులు ఛేదించారు. మహిళ సహా ఐదుగురు నేరస్థులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వివరాలు వెల్లడించారు. పరకాల (Parakala)కి చెందిన మడికొండ సుమన్ భరత్ 2012లో లావణ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. లావణ్య కు పరకాల పట్టణంలోని ఇమ్మడి నరేశ్ తో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబందానికి దారి తీసింది. ఆ విషయంలో సుమన్ భరత్ లావణ్యను రోజు తాగి వచ్చి కొట్టి హింసించేవాడు.
భాధను భరించలేక తమ్ముడు పెండల రాజుతో పాటు నరేశ్ తో చెప్పింది. దీంతో వారికి పరిచయం ఉన్న ములుగు జిల్లాలో గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లును సంప్రదించి సుమన్ హత్యకు రూ. 5 లక్షలు సుపారీ మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో లావణ్య బంగారం కుదువ పెట్టి రూ. 4,59,000 లక్షలు చిరంశెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చింది. అతను భూక్య రాకేష్ తో కలిసి మృతుడు సుమన్ భరత్ కి మద్యం, డబ్బుల ఆశ చూపి ఈ నెల 3న రాత్రి 8 గంటలకు ములుగుకి పిలిపించుకున్నారు. అక్కడి నుండి వెంకటేశ్వర్లు తన వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి, సుమన్ భరత్ కి మందు తాగించాడు. అతడు మద్యం మత్తులో లేవలేని స్థితిలో ఉండగా ఇదే అదునుగా భావించి బీర్ బాటిల్ తో తల వెనక భాగంలో కొట్టి చంపాడు. ఈ క్రమంలో వారు ముందే తెచ్చి పెట్టుకున్న పెట్రోల్ మృతదేహం పై పోసి నిప్పంటించారు. సుమన్ మృతదేహం మంటల్లో కాలుతున్న దృశ్యాలను భూక్య రాకేశ్, వెంకటేశ్వర్లు ఫోన్లో వీడియో తీసి మరుసటి రోజు లావణ్య, పెండల రాజుకు చూపించాడు.
అప్పుడు లావణ్య, చిరంశెట్టి వెంకటేశ్వర్లు కు మిగితా డబ్బులు నలభై వేలు ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి లావణ్య తన అత్తగారి ఇల్లు అయిన పరకాలకు వెళ్ళింది. 5న చిరంశెట్టి వెంకటేశ్వర్లు రాత్రి 10 గంటలకు పొలం వద్దకు వెళ్లి సుమన్ భరత్ కాలిపోగా మిగిలిన బొక్కలు తీసుకొని ఒక సంచిలో వేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా పక్కన ఉన్న వాగులో పడవేశారు. ఈ నెల 8న సుమన్ భరత్ తండ్రి సాంబయ్య తన కొడుకు కనిపించడం లేదని పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఏసీపీ సతీష్ బాబు ఆధ్వర్యంలో సీ ఐ క్రాంతి కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుమన్ భరత్ భార్య లావణ్య ను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.

