కలం, స్పోర్ట్స్ : కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాకిస్థాన్ బాక్సర్ ఫాతిమా (Fatima Zahra) చారిత్రాత్మక కాంస్య పతకం గెలిచింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. తన ఇన్‌స్పిరేషన్ భారత బాక్సర్ మేరీ కోమ్ అని చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 22 ఏళ్ల ఫాతిమా జహ్రా మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. కామన్‌వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో పతకం గెలిచిన తొలి పాకిస్థాన్ మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సర్‌గోధాలో పెరిగిన ఫాతిమాకు చిన్నతనంలో మహిళా బాక్సర్లలో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మేరీ కోమ్ అని తెలిపింది. మేరీ కోమ్ విజయాలే కాదు.. ఆమె జీవిత ప్రయాణం కూడా తనను బాగా ప్రభావితం చేసిందని చెప్పింది. పేద రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రపంచ స్థాయి బాక్సర్‌గా ఎదిగిన మేరీ కోమ్ కథ తనకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేదని పేర్కొంది.
మేరీ కోమ్ జీవితంపై తీసిన బాలీవుడ్ సినిమాను చిన్నప్పటి నుంచి చూసేదాన్నని తెలిపింది. తాను బాక్సింగ్ ప్రారంభించిన తర్వాత కూడా ఆ సినిమాను చూస్తూ సాధన చేసేదాన్నని వెల్లడించింది. ఒకరోజు మేరీ కోమ్‌లా ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పింది. అవకాశం వస్తే ఆమెను తప్పకుండా కలవాలనే కోరిక కూడా వ్యక్తం చేసింది. ఫాతిమా ప్రయాణం కూడా సులభంగా సాగలేదు.
తన కుటుంబం మొదట బాక్సింగ్‌కు వ్యతిరేకించిందని తెలిపింది. శిక్షణకు వెళ్లనివ్వలేదని గుర్తు చేసుకుంది. అయినా వెనక్కి తగ్గకుండా సాధన కొనసాగించానని చెప్పింది. తన తొలి కోచ్ ప్రతి విషయంలో అండగా నిలిచాడని పేర్కొంది. ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యులే తనకు అతిపెద్ద బలంగా మారారని తెలిపింది. పోటీ సమయంలో తనకంటే వారే ఎక్కువగా ఆందోళన చెందుతారని చిరునవ్వుతో చెప్పింది.
తాను సాధించిన ఈ కాంస్య పతకం మరిన్ని పాకిస్థాన్ అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు ఫాతిమా తెలిపింది. ఇంటి పనులకే పరిమితం కాకుండా క్రీడల్లోకి రావాలని యువతులకు పిలుపునిచ్చింది. తాను పడిన కష్టం, సాధించిన విజయం మరెందరికో ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించింది.

