కలం, నాగర్‌కర్నూల్: నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది న్యాయమైన కోరికలను ప్రభుత్వం మౌనం వీడి పరిష్కరించాలని ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కార్యదర్శి దామట్ల కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె (NHM Employees Strike) తొమ్మిదో రోజుకు చేరుకుంది. కరీ పండుగ రోజున కూడా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగించారు. ఇందులో భాగంగా మౌనదీక్ష చేపట్టి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన సమయంలో గొడ్డుకారంతో భోజనం చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటుండగా, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మాత్రం ఉద్యోగ భద్రత, భవిష్యత్తుపై ఆందోళనతో పండుగను నిరాశతో గడపాల్సి వస్తోందని దామగట్ల కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కుటుంబాలు కూడా ఈ పరిస్థితుల వల్ల మానసిక ఆవేదనకు గురవుతున్నాయని పేర్కొన్నారు. పండుగ రోజున కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి రావడం ఉద్యోగుల సమస్యల తీవ్రతను తెలియజేస్తోందన్నారు.
ప్రభుత్వం ఇకనైనా మౌనం వీడి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలని దామగట్ల కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజారోగ్య సేవల్లో భాగస్వాములవుతున్న ఉద్యోగుల సేవలను గుర్తించి, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరించి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి డిమాండ్లను పరిష్కరించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, డాక్టర్ రాజు, డాక్టర్ అక్బర్, డాక్టర్ యూసుఫ్ నవీద్, డాక్టర్ ఉమేరా, డాక్టర్ సురేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు రజియా, చంద్రకళ, వనజతో పాటు పలువురు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.

