కలం, మహబూబ్ నగర్ బ్యూరో: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ డి. జానకి (SP Janaki) అన్నారు. పోలీస్ అమరవీరుల (Police Martyrs) స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కవాతు మైదానంలో స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి.జానకి ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్ఫూర్తి నింపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహిస్తూ దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు వీరుల త్యాగాలను స్మరించుకుంటామని తెలిపారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తారని, అవసరమైన సందర్భాల్లో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారి ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ అన్నారు. అమరవీరుల కుటుంబాలు చేసిన త్యాగాలను కూడా సమాజం ఎప్పటికీ మరచిపోకూడదని తెలిపారు. వారి త్యాగాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొంటూ, అమరులైన ప్రతి పోలీసు వీరునికి హృదయపూర్వక నివాళులర్పించారు.
అనంతరం జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులను ఎస్పీ కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి క్లాక్ టవర్, రామ్ మందిర్ చౌరస్తా, లైబ్రరీ మీదుగా మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరదేశి నాయుడు సర్కిల్ వరకు అమరవీరుల స్మారక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం పరదేశి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేష్ కుమార్, జైలు సూపరింటెండెంట్ కాళిదాస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణా రెడ్డి, ఇంటిలిజెన్స్ డీఎస్‌పీ ఆనంద్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ సిబ్బంది, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.

