కూటమి మంత్రులపై హత్యాయత్నం.. జనసేన ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

కలం, వెబ్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతలు మళ్లీ రాష్ట్రంలో అరాచకాలు, హింసాత్మక చర్యలకు ఒడిగడుతున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetti Srinivas) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమతో పాటు పల్నాడు ప్రాంతాల్లో వైసీపీ నాయకులు వరుస దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారిని కూడా లక్ష్యంగా చేసుకుని, వారిని హతమార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం ప్రతిపక్షంలో ఉన్నా హత్యా రాజకీయాలనే ప్రోత్సహిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

వైసీపీ నేతల దౌర్జన్యాలకు అద్దం పడుతూ, ప్రజాధనంతో నిర్మించిన రూ. 4.5 కోట్ల విలువైన రహదారిని ట్రాక్టర్‌తో దున్నేసి ధ్వంసం చేయడం వారి విధ్వంసకర మనస్తత్వానికి నిదర్శనమని బొలిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ, ఇప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా వైసీపీ ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ప్రజల మౌలిక సదుపాయాలను నాశనం చేసే ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని హెచ్చరించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పారని, స్థానిక పోరులో కూడా అదే తీర్పు పునరావృతమవుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని.. పార్టీ లైన్ దాటి క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడే వారిపై ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>