కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా రఘునాథపాలెం (Raghunadapalem) మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. కన్నపేగు కూడా కరగని అప్పుడే పుట్టిన నవజాత శిశువు పట్ల గుర్తుతెలియని వ్యక్తులు కనికరం లేకుండా కర్కశత్వాన్ని ప్రదర్శించారు. పసికందును బొప్పాయి తోటలో వదిలివెళ్లిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రఘునాథపాలెం (Raghunadapalem) మండల పరిధిలోని వీఆర్ బంజర గ్రామంలో గల ఓ బొప్పాయి తోట సమీపంలో బట్టలో చుట్టి ఉన్న నవజాత మగ శిశువును స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం తోటలో నుంచి పసికందు ఏడుపు వినిపించడంతో అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ భూక్యా రమణ దృష్టికి తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్పందించి, మంచుకొండ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని ఆశా వర్కర్ రామ దేవికి సమాచారం అందించారు. ఆమె వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, సర్పంచ్ కారులోనే ఆ పసికందును సురక్షితంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి (GGH) తరలించారు.
ఖమ్మం జీజీహెచ్ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డు ఐసీయూలో వైద్యులు శిశువుకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా, ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిన్నారి శిశు సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉంది.
ఈ అమానవీయ చర్యకు పాల్పడిన తల్లిదండ్రులు లేదా గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుల ఆచూకీ కోసం సమీప ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో ఇటీవల నమోదైన ప్రసవ వివరాలపై ఆరా తీస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read : స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్ఫార్మ్స్ బ్లాక్బస్టర్ ఎంట్రీ!
Follow Us On : WhatsApp

