నవజాత శిశువు ఘటన.. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్‌లో(Mahabubnagar) నవజాత శిశువును రోడ్డుపై వదిలివెళ్లిన ఘటనను (Newborn Baby Abandonment Case) టూ టౌన్ పోలీసులు సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ఎస్‌డీపీఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎజాజుద్దీన్ నేతృత్వంలో ఎస్‌ఐ శివ నాగేశ్వర్ నాయుడు, పోలీసు సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 5న మహబూబ్‌నగర్‌లోని కేఎఫ్‌సీ సమీపంలో రోడ్డుపై నవజాత శిశువును వదిలివెళ్లిన ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఘటనకు సంబంధించిన వ్యక్తులను గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా ఓ మైనర్ బాలికకు గార్లపాడు గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు ప్రేమ పేరుతో పరిచయమై, ఆమెను మోసం చేయడంతో బాలిక గర్భం దాల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టింది. ఈ నెల 4న కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆటోలో మహబూబ్‌నగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆటోలో ప్రసవం జరిగింది. విషయం బయటకు వస్తుందనే భయంతో బాలిక తల్లి, తండ్రి, బాబాయి కలిసి శిశువును రోడ్డుపై వదిలివెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు

కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించిన టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎజాజుద్దీన్, ఎస్‌ఐ శివ నాగేశ్వర్ నాయుడు, ఏఎస్ఐ సాయి నిర్మల దేవి, హెడ్ కానిస్టేబుల్ శేఖర్, కానిస్టేబుళ్లు అశోక్, కురుమూర్తిలను ఎస్పీ డి.జానకి అభినందించారు. నేరాల ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎజాజుద్దీన్ మాట్లాడుతూ.. మైనర్ బాలికలు ప్రేమ పేరుతో మోసపోయి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి, లైంగికంగా వేధించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>