కలం, వెబ్ డెస్క్: ఏపీలో జడ్పీ ఎన్నికల (AP ZP Elections) ప్రక్రియ పూర్తయింది. మొత్తం 28 జడ్పీ ఛైర్మన్ పదవుల్లో ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని చోట్ల ఎన్డీయే కూటమి పార్టీలే గెలుపొందాయి. టీడీపీకి 22 స్థానాలు, జనసేనకు 4, బీజేపీకి ఒక జడ్పీ ఛైర్మన్ స్థానం లభించింది. అల్లూరి జిల్లా జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పోస్టులను మాత్రం వైసీపీ గెల్చుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం.. ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు చేతులెత్తే పద్ధతిలో జడ్పీ ఛైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ దఫా ఎన్నికల్లో సామాజిక సమీకరణాలకు కూటమి అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
సామాజిక వర్గాల వారీగా..
బీసీ సామాజిక వర్గానికి ఆరు, ఎస్సీ వర్గానికి అయిదు, ఎస్టీ వర్గానికి ఒకటి, మైనార్టీలకు ఒక ఛైర్మన్ పోస్టులు లభించాయి. ఓసీ వర్గాలకు 9 ఛైర్మన్ పదవులను కేటాయించగా.. మహిళా నేతలకు ఎక్కువ అవకాశం రావడం గమనార్హం. వీరిలో విజయనగరం జడ్పీ ఛైర్పర్సన్గా మజ్జి సిరిసహస్ర, ఏలూరు జడ్పీ ఛైర్పర్సన్గా సాయి నవ్యశ్రీ, విశాఖపట్నం జడ్పీ ఛైర్పర్సన్గా గాడు అలివేణి తదితరులు ఎన్నికయ్యారు.
గతంలో 13 జడ్పీ స్థానాలుండగా.. జిల్లాలు పెరగడంతో ప్రస్తుతం 28 జడ్పీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇలా 15 కొత్త జిల్లాలలకు తొలిసారి జడ్పీ ఛైర్మన్లు ఎన్నికయ్యారు. ఇక జడ్పీ సభ్యులు తక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం కాగా, ఎక్కువ మంది జడ్పీ సభ్యులున్న జిల్లాగా కడప నిలిచింది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో ఇక నుంచి ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులపై పర్యవేక్షణ మరింత పెరగనుంది.

