కలం, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం ధరణి పేరుతో చేసిన భూ దోపిడీ (Dharani Land Scam ) ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ధరణి భూ దోపిడీపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామంటూ సీఎం రేవంత్ ముందుగానే ప్రకటించారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, చర్చలో పాల్గొనాలని కూడా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సవాలు విసిరారు.
ప్రభుత్వం ప్రకటించినట్లుగానే శనివారం 22 ఏ అంశంపై స్వల్పకాలిక చర్చ నిర్వహించింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు ఉదాహరణలతో గత ప్రభుత్వంలో జరిగిన భూముల గోల్‌మాల్‌పై వివరణ ఇచ్చారు. సహచర మంత్రులు సహా కాంగర్స్ ఎమ్మెల్యేలు ఈ వివరణపై సంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వ వివరణ పట్ల పరోక్షంగా సమ్మతి తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 15న కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పొంగులేటి వెల్లడించిన భూ దోపిడీపై సమగ్రమైన దర్యాప్తు నిర్వహించేలా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
బీఆర్ఎస్‌కు ఊహించని షాక్!
నిషేధిత భూముల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై గత కొన్ని వారాలుగా బీఆర్ఎస్ దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ప్రభుత్వం ఊహించని షాక్ ఇవ్వాలనుకుంటున్నది. ధరణి అమల్లో ఉన్న కాలం సహా బీఆర్ఎస్ హయాంలో జరిగిన మొత్తం భూ లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా మంత్రులతో జరిగే సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. మొత్తం 22-ఏ వ్యవహారంపై మంత్రులతో సీఎం లోతుగా చర్చించనున్నారు. శాసనసభ తిరిగి బుధవారం సమావేశం కానున్నందున 22-ఏ అంశంలో సీఎం ప్రసంగించి ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశమున్నది. మంత్రులతో మంగళవారం జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బుధవారం అసెంబ్లీ వేదికగానే సీఎం ప్రకటించే అవకాశమున్నది. దర్యాప్తు విషయమై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత బీఆర్ఎస్ లీడర్లలో ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ భవన్‌లో 22-ఏ బాధితుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసేలా సీఎం కౌంటర్ స్ట్రాటెజీ రూపొందించబోతున్నారు.

