ఐఐటీ కంటే కష్టం.. శ్రీశంకర్ కంబ్యాక్ రికార్డు!

కలం, స్పోర్ట్స్ : గాయం వల్ల కెరీర్ ముగిసిపోతుందనుకున్న చోట నుంచి తిరిగొచ్చి పతకం గెలవడం సాధారణ విషయం కాదు. భారత లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్ (Murali Sreeshankar) సరిగ్గా ఇదే సాధించాడు. ఇటీవలే ముగిసిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 8.09 మీటర్ల దూరం దూకి రజత పతకం సాధించాడు. తీవ్రమైన మోకాలి గాయాన్ని జయించి, రెండేళ్ల తర్వాత మళ్లీ పతకంతో రికార్డు సృష్టించాడు.

మోగాలికి నాలుగు స్క్రూలు

2024 పారిస్ ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు శ్రీశంకర్ టేక్ ఆఫ్ కాలులోని పటేల్లార్ టెండన్ చిరిగిపోయింది. ముంబై వైద్యులు ఈ గాయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ క్రీడా గాయం కాదని, రోడ్డు ప్రమాదాల్లో మాత్రమే ఇలాంటి తీవ్ర గాయాలు చూస్తామని చెప్పారు. శ్రీశంకర్ మళ్లీ నడవలేడేమోనని ఆయన తండ్రి తీవ్రంగా భయపడ్డారు.

సుదీర్ఘంగా సాగిన రికవరీ

మెరుగైన వైద్యం కోసం తండ్రితో కలిసి శ్రీశంకర్ దోహాలోని ఆస్పేటార్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఆయన మోకాలికి నాలుగు స్క్రూలు వేసి సర్జరీ చేశారు. ఆ తర్వాత ఎనిమిది నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. కోచ్ వేన్ లాంబార్డ్ రూపొందించిన ప్రత్యేక శిక్షణా విధానంతో శ్రీశంకర్ నెమ్మదిగా కోలుకున్నాడు.

ఐఐటీ, సివిల్స్‌ కంటే కష్టమైన రీఎంట్రీ

ఈ పునరాగమనం గురించి శ్రీశంకర్ తండ్రి ఎస్ మురళి ఆసక్తికరంగా మాట్లాడారు. తన కొడుకు రీఎంట్రీ ప్రయాణం ఒకేసారి ఐఐటీ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవ్వడం కంటే కష్టమని ఆయన చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్‌లో చలి, వర్షం, ఈదురుగాలులు ఉన్నప్పటికీ శ్రీశంకర్ చూపిన మానసిక పట్టుదల తనకు ఎంతో తృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ముందున్న లక్ష్యాలు

తిరిగి మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీశంకర్ వరుసగా ఎనిమిది మీటర్ల మార్కును దాటుతున్నాడు. జూన్‌లో జరిగిన ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో 8.38 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ప్రస్తుతం ప్రాగ్‌లో శిక్షణ పొందుతున్న శ్రీశంకర్, భువనేశ్వర్ ఈవెంట్, రాబోయే ఆసియా గేమ్స్‌పై దృష్టి సారించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>