ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి అనుమతులివ్వాలి : ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheeshwar Reddy) డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. 2023లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు పూర్తికాకపోవడం ఆందోళనకరమన్నారు. గత ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీకి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని తెలిపారు.

అయితే శ్రీరామ్ సాగర్ జలాశయం సమీపంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని, ఫ్యాక్టరీ అందుబాటులో లేకపోవడంతో దిగుబడి సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు.

ఆయిల్ ఫామ్ పంటకు సుమారు మూడేళ్ల తర్వాత దిగుబడి వస్తుందని, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అందుబాటులో లేకుంటే రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అవసరమైన అనుమతులు మంజూరు చేసి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>