కలం, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) రెండు టోర్నీలు ఒకే సమయంలో జరుగుతున్నాయి. దీంతో విదేశీ ఆటగాళ్లు అటా ఇటా అన్నది తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు పీఎస్‌ఎల్‌కు నో చెప్పి ఐపీఎల్‌కు వస్తే, మరికొందరు ఐపీఎల్‌కు నో చెప్పి పీఎస్‌ఎల్ వైపు వెళ్లారు. వీరిలో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (Moeen Ali) కూడా ఒకడు. గత ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడిన మొయిన్ అలీ, ఈసారి ఐపీఎల్‌ను పక్కన పెట్టి పీఎస్ఎల్‌లో రిజిస్టర్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, తాజాగా ఆయన తన నిర్ణయానికి గల కారణాలను మొయిన్ అలీ స్పష్టం చేశారు.
మొయిన్ అలీ నిర్ణయం వెనుక గత ఏడాది ఐపీఎల్ చేదు అనుభవాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2025 సీజన్‌లో కేకేఆర్ రూ. 2 కోట్లకు ఆయన్ని కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో ఆయనకు కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే ఆడే అవకాశం దక్కింది. ఆరు మ్యాచ్‌లు ఆడినా కేవలం రెండు సార్లు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం రావడం, అందులో కేవలం 5 పరుగులు మాత్రమే చేయడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. తన కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు మైదానంలో ఎక్కువ సమయం గడపాలని, బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో ఉన్న మొయిన్ అలీ, తన కెరీర్‌ను సాధ్యమైనంత వరకు పొడిగించుకోవాలని భావిస్తున్నారు. ఐపీఎల్‌తో పోలిస్తే పీఎస్ఎల్ తక్కువ రోజులు జరుగుతుందని, ఇది తన కుటుంబంతో గడపడానికి అనుకూలంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. అలాగే కరాచీ కింగ్స్ జట్టులో చేరడం కూడా తన నిర్ణయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. పీఎస్ఎల్ ఆడాలనే కోరిక ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, అది ఐపీఎల్ సమయంతోనే క్లాష్ అవ్వడం వల్ల ఇప్పటివరకు వీలు పడలేదని వివరించారు.
ప్రస్తుతం పీఎస్ఎల్‌లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్న మొయిన్ అలీ ఏడాదికి రూ. 2.14 కోట్ల వేతనాన్ని అందుకుంటున్నారు. ఎక్కడైనా జట్టులో స్థానానికి గ్యారెంటీ ఉండదని తెలిసినప్పటికీ, తన క్రికెట్‌ను ఆస్వాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. తన ఆటతీరు ప్రస్తుతం మెరుగ్గా ఉందని, అందుకే ఆడే అవకాశం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు మొయిన్ అలీ స్పష్టం చేశారు.

