కలం, కరీంనగర్ బ్యూరో : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) డిమాండ్ చేశారు. పథకాల పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మెట్పల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదన్నారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు అందాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

