కలం, దేవరకొండ : ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని, రాజ్యాంగం కల్పించిన ఆ విలువైన ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి జాతీయ బాధ్యత అని దేవరకొండ (Devarakonda) ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Nenavath Balu Naik ) పేర్కొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ, ఓటరు జాబితా సవరణలకు సంబంధించి నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై సోమవారం ఆయన చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహన సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. ఒక ఓటు ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలదని, ప్రజల భవిష్యత్తును నిర్ణయించగలదని అన్నారు. ప్రతి అర్హుడైన ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా ఉందో లేదో పరిశీలించుకుని, అవసరమైతే ప్రక్రియ ద్వారా మార్పులు చేర్పులు చేయించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారుతోందని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం జరుపుతున్న పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు ప్రతి గ్రామంలో ఓటర్ల హక్కుల పరిరక్షణకు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

