కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా ప్రతినిధులు సాధారణంగా పర్యటనలకు వచ్చినప్పుడు అధికారులతో సమీక్షలు జరపడం లేదా ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించడం చూస్తుంటాం. కానీ, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ (MLA Jare Adinarayana) మాత్రం ఇందుకు భిన్నంగా అందరినీ ఆశ్చర్యపరిచారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని రావిచెట్టు సెంటర్ గుండా వెళ్తున్న ఆయన, రహదారి పక్కన చేపలు విక్రయిస్తున్న ఒక షాప్ దగ్గర హఠాత్తుగా ఆగారు. చేపల వ్యాపారి వీరన్న దగ్గరకు వెళ్లిన ఎమ్మెల్యే, మొదట కిలో చేపల ధర ఎంత అని అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా, స్వయంగా తన చేతులతోనే అక్కడ ఉన్న చేపలను నీళ్లతో కడిగి శుభ్రం చేయడం ప్రారంభించారు.
అయితే ఎమ్మెల్యే స్వయంగా చేపలు కడగడం చూసి అక్కడ ఉన్నవారు, రహదారిపై వెళ్లే బాటసారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ దృశ్యాన్ని చూసేందుకు బాటసారులు కాసేపు వాహనాలు నిలిపి ఆసక్తిగా చూశారు. వినియోగదారులకు అమ్మే చేపలను ఎప్పుడూ బాగా శుభ్రం చేసి మాత్రమే విక్రయించాలని, పరిశుభ్రత పాటించాలని ఈ సందర్భంగా వ్యాపారికి ఎమ్మెల్యే సూచించారు.
ఇదే సమయంలో వ్యాపారి యోగక్షేమాలను ఆరా తీస్తూ.. ‘నీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా?’ అని అడగ్గా, తనకు ఇల్లు వచ్చిందని వీరన్న చెప్పడంతో ఎమ్మెల్యే సంతోషం, సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఏమాత్రం హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ వ్యక్తిలా చేపలు కడిగిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తీరు ప్రస్తుతం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

