కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, వరుస దోపిడీలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తీవ్రంగా విమర్శించారు. నగరంలోని భగత్‌నగర్ చౌరస్తాలో ఇటీవల దోపిడీకి గురైన మున్నాభాయ్ కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను అడిగి ఘటన వివరాలను తెలుసుకున్న అనంతరం పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులలోగా దోపిడీ నిందితులను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కమిషనరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
జూన్ నెలలోనే తమ కారు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఎమ్మెల్యే (Gangula Kamalakar)కు వివరించారు. అప్పుడే పోలీసులు స్పందించి కారు దొంగలను గుర్తించి ఉంటే ప్రస్తుతం జరిగిన భారీ దోపిడీ జరిగేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కారు చోరీకి పాల్పడిన వారే పథకం ప్రకారం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులపై దాడి చేసి సుమారు 62 తులాల బంగారం, రూ.25 లక్షల నగదు దోచుకెళ్లారని తెలిపారు. అనుమానితుల సీసీటీవీ ఫుటేజీ వివరాలు అందించినప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని గంగుల కమలాకర్ ఆరోపించారు.
దొంగలకు అడ్డాగా మారిన కరీంనగర్
తాను పుట్టి పెరిగిన కరీంనగర్లో గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని గంగుల కమలాకర్ అన్నారు. ప్రస్తుతం నగరం దోపిడీ దొంగలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. గతంలో పీఎంజే జ్యువెలర్స్‌లో జరిగిన దోపిడీ కేసులోనూ నిందితులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని, ఇప్పటివరకు సొత్తు రికవరీ చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
పోలీసుల ప్రాధాన్యతలు మారాయి
డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలపై చూపుతున్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో చూపడం లేదని గంగుల విమర్శించారు. గతంలో కరీంనగర్ సురక్షిత నగరంగా ఉండేదని, అర్ధరాత్రి వేళల్లోనూ మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. దోపిడీ కేసులో నిందితులను వారం రోజులలో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన ఆయన, లేనిపక్షంలో పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై కరీంనగర్ టౌన్ ఏసీపీతో ఫోన్లో మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్నారు. భయాందోళనలో ఉన్న బాధిత కుటుంబానికి తక్షణమే పోలీస్ రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, నాయకులు సుంకిశాల సంపత్ రావు, నేతి రవి వర్మ, మిడిదొడ్డి నవీన్, జి.పి. స్వామి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Also: రాహుల్ పోరాటంతోనే ధర్మేంద్ర రాజీనామా: మహేశ్ గౌడ్
Follow Us On: Sharechat

