మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. పోలీసులపై విమర్శలు!

కలం, జనగామ: జనగామ జిల్లా బచ్చన్నపేట పోలీస్ (Bachannapet Police) స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బచ్చన్నపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి తన కుమార్తె కనిపించడం లేదంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సదరు యువతి తాను ప్రేమించిన బాలుడు, అతడి బంధువులను వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది.

తాను ఆ బాలుడిని ప్రేమిస్తున్నానని, అతడినే వివాహం చేసుకుంటానని యువతి పోలీసులకు చెప్పింది. అయితే బాలుడు మైనర్ అని తేలింది. మేజర్‌ కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉందని, తమ కుమార్తెను అతడితో పంపించేందుకు అంగీకరించబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. తమ అభ్యంతరాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, చివరకు యువతిని బాలుడి బంధువుల వెంట పంపించారని తండ్రి ఆరోపిస్తున్నారు.

రక్షణ కల్పించాల్సిన వారే ఇలా చేస్తారా.. ?

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకు రక్షణ కల్పించి, చట్టప్రకారం వ్యవహరించాల్సిన పోలీసులు.. బాలుడి వయసు, చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నా తమ అభ్యంతరాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. యువతిని బాలుడి బంధువులతో పంపించే ముందు ఎలాంటి న్యాయపరమైన ప్రక్రియను అనుసరించారనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. తమ కుమార్తెకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే బాధ్యతారహితంగా వ్యవహరించారని యువతి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలుడు మైనర్‌గా ఉన్న విషయం తెలిసినా అతడి బంధువులతో కుమార్తెను పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలిపై ఉన్నతాధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>