సిక్కు సోదరులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిక్కు బంధువులందరికీ గురునానక్ జయంతి (Guru Nanak Jayanti) శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ అంటే ఒక మతానికి చెందిన గురువు మాత్రమే కాదు.. యావత్ మానవాళికి మార్గదర్శకుడని కొనియాడారు. ఆయన చూపించిన మార్గం మానవత్వానికి మార్గం.. సమానత్వానికి మార్గం.. సేవకు మార్గమని పేర్కొన్నారు. ఈ మేరకు ఈరోజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

గురునానక్ ప్రపంచానికి మూడు గొప్ప సందేశాలు ఇచ్చారని తెలిపారు. అవి 1. కీరత్ కరో – నిజాయితీగా కష్టపడి పనిచేయండి. 2.నామ్ జపో – భగవంతుడిని స్మరించండి. 3.వండ్ చకో – సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోండి అనే ఈ 3 సూత్రాలు ప్రతి మనిషి జీవితంలో ఆచరిస్తే సమాజంలో ఆకలి, అసమానత, విద్వేషాలకు చోటుండదని అన్నారు.

గురునానక్ దేవ్ జీ బోధనలు చిరస్మరణీయం కావాలని, సిక్కు గురువుల త్యాగాలు అజరామరం కావాలని ఆకాక్షించారు. గురుద్వారాల్లో నిర్వహించే లంగర్ సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శమని ప్రశంసించారు. అక్కడ పేదవాడు, ధనవంతుడు అనే తేడా లేదని, కులం, మతం, హోదా అనే భేదాలు లేవని, అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేస్తారన్నారు. ఆకలితో వచ్చిన వ్యక్తికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి ఉండదని తెలిపారు. ఇది కేవలం అన్నదానం కాదు.. సమానత్వానికి నిలువెత్తు నిదర్శనమని హితవు పలికారు. సిక్కు సమాజం ప్రపంచానికి నేర్పిన గొప్ప సంస్కారం ఇదేనని, గురునానక్ స్పూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ హితానికి పాల్పడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>