కలం, వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజం మెటా (Meta) మరో కొత్త యాప్ ప్రవేశపెట్టింది. యువతను ఆకట్టుకునేందుకు ఇన్‌స్టాంట్స్ అనే పేరుతో సరికొత్త యాప్‌ను (Instants App) ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్ ఇటలీ, స్పెయిన్, దేశాల్లోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ యాప్ ముఖ్యంగా స్నాప్ చాట్ (Snapchat)కు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నేటి యువత తమ డైలీ రొటీన్‌లో స్నాప్‌చాట్‌కు విపరీతంగా అలవాటుపడ్డారు. ప్రతి చిన్న విషయాన్ని ఫోటో తీసి స్నాప్‌లో పెట్టేస్తుంటారు. దీనికి పోటీగా ఇన్‌స్టాంట్స్ “రియల్ లైఫ్, రియల్ క్విక్” అనే నినాదంతో మార్కెట్‌లోకి వస్తోంది. ఈ యాప్ ద్వారా పంపే ఫోటోలు, వీడియోలు కేవలం ఒక్కసారి మాత్రమే చూడటానికి వీలవుతుంది. అంతేకాకుండా 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా అవి డిలీట్ అయిపోతాయి.
ఈ యాప్ ప్రధాన ఉద్దేశం సోషల్ మీడియాలో కృత్రిమ ఎడిటింగ్, ఫిల్టర్ల ప్రభావం తగ్గించి నేచురల్ ఫోటోలను ప్రోత్సహించడం. ఇందులో ఫోన్ గ్యాలరీ నుంచి ఫోటోలు అప్‌లోడ్ చేసే ఛాన్స్ ఉండదు. కేవలం యాప్‌లోని కెమెరా ద్వారా అప్పటికప్పుడు ఫోటో తీసి మనకు నచ్చిన వాళ్లకు పంపుకోవచ్చు. ఇంకా ఫోటోకు టెక్ట్స్ యాడ్ చేయడం తప్ప ఇందులో ఇతర ఎడిటింగ్ టూల్స్ ఉండవు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తోనే ఇందులోకి లాగిన్ అవ్వొచ్చు. మ్యూచువల్ ఫాలోవర్స్, లేదా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వారికి మాత్రమే ఫోటోలు పంపే వీలుంటుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ కమర్షియల్‌గా మారుతుండటంతో ఫ్రెండ్స్ మధ్య వ్యక్తిగత సంభాషణ కోసం మెటా ఈ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. యూజర్ల నుంచి వచ్చే స్పందనను బట్టి అమెరికా, భారత్ వంటి ఇతర దేశాల్లోని మార్కెట్లలో విడుదల చేస్తారు. స్నాప్‌చాట్ యూజర్లనే లక్ష్యంగా చేసుకొని మెటా తీసుకొచ్చిన ఈ ఇన్‌స్టాంట్స్ యాప్ (Instants App) ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.
Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్
Follow Us On: Instagram

