జాబ్ పోర్టల్‌తో మెదక్ నిరుద్యోగ యువతకు భరోసా

కలం, మెదక్ బ్యూరో: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా మెదక్ జిల్లా యంత్రాగం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ప్రత్యేకంగా జాబ్ పోర్టల్‌ను (Job Portal) రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి సంస్థలు, కళాశాల విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం పోర్టల్ ఏర్పాటు చేసిన తొలి జిల్లాగా మెదక్ నిలిచింది.

జిల్లాలోని పరిశ్రమలు అవసరాలను, స్థానిక విద్యార్థులకు అవకాశాలుగా మార్చే ఉద్దేశంతో ఈ జాబ్ పోర్టల్‌ను రూపొందించారు. పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల సమక్షంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పోర్టల్‌ను ప్రారంభించారు. మెదక్ జిల్లా ఐటీ బృందం, ఐటీసీ (ITC) లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ రూపొందించబడింది. ఇందులో టూ-ట్రాక్ రిజిస్ట్రేషన్ పద్ధతిని అవలంభిస్తున్నారు.

ఉపాధి లక్ష్యంగా..

మెదక్ జిల్లా వ్యాప్తంగా 300 నుంచి 350 వరకు చిన్న, మధ్య, భారీ పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. జిల్లాలోని పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 20,000 నుంచి 25,000 మందికిపైగా కార్మికులకు, ఉద్యోగులకు ఉపాధి లభిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి వందల కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో దాదాపు 50 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. చాలామంది యువత తమ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు జిల్లాలో ఉన్నప్పటికీ, సరైన సమాచారం లేక హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్తున్నారు.

యువత స్థానికంగానే తమ నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు సాధించి, ఉన్నత స్థాయికి ఎదగడమే లక్ష్యంగా జాబ్ పోర్టల్‌ను పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. స్థానిక పరిశ్రమల్లోనే ఉద్యోగ అవకాశాల అందించడం ద్వారా నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపనున్నామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>