కలం, యాదగిరిగుట్ట: ఎల్నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag Jayanthi) అన్నారు. చౌటుప్పల్ మండలం మశీదుగూడెంలో రైతులకు అవగాహన సమావేశంలో పాల్గొన్నారు. మూసీ నది ప్రాంతంలో ఎల్నినో ప్రభావం కొంత మేర తక్కువగా ఉన్నా.. భవిష్యత్లో నీటి లభ్యతపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందని కలెక్టర్ సూచించారు.
అధికారుల సూచనలతోనే..
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి.వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని భూములకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి హేమలత మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట సాగులో సబ్సిడీ పథకాలను వివరించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు కూసుకుంట్ల రామ్ రెడ్డి, యాస రామ కృష్ణ రెడ్డి తమ అనుభవాలు వివరించారు.
రైతు జక్కిడి కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దకొండూరులో ఏర్పాటు కాబోతున్న బయోగ్యాస్ ప్లాంటుకి అవసరమైన నేపియర్ గడ్డి సాగు చేసి అధిక లాభాలు పొందుతున్నట్లు తెలిపారు. ఆర్డీవో శేఖర్ రెడ్డి, డీఎల్పీవో ప్రతాప్ నాయక్, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, మసీదుగూడెం సర్పంచి మర్రి వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

