రోడ్డు పనులు పూర్తి చేయకుంటే దీక్షకు పూనుకుంటా : ఎమ్మెల్యే కవ్వంపల్లి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి పొత్తూర్ (Gundlapalli–Potthur) వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మానకొండూర్ ఎమ్మెల్యే (Manakondur MLA) డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మానకొండూర్ నియోజకవర్గంలోని రోడ్ల సమస్యలను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో చాలా సార్లు రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగిందని, పంచాయతీరాజ్, రోడ్లు–భవనాల శాఖల పరిధిలో పలు రోడ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

కాగితాలపై అనుమతులు మంజూరవుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణాలు పూర్తికాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు కూడా కొంత ఇబ్బంది కలుగుతోందని ఆయన స్పష్టం చేశారు. గుండ్లపల్లి–పొత్తూర్ రోడ్డు నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని, గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampalli Satyanarayana) తెలిపారు.

సమస్యను పరిష్కరించి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను కోరుతున్నప్పటికీ ఆయన సుముఖంగా లేరని సభ దృష్టికి తీసుకెళ్లారు. పాత బిల్లులను వెంటనే చెల్లించి గుండ్లపల్లి–పొత్తూర్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తానని ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చానని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు నిర్మాణం పూర్తికాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈసమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>