కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) ప్రక్రియను పక్కాగా నిర్వహించేందుకు ఓటర్లందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ అధికారిణి జి. పద్మజా రాణి పిలుపునిచ్చారు. జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల పర్యవేక్షణ నిమిత్తం గురువారం జిల్లాకు విచ్చేసిన ఆమెకు అదనపు కలెక్టర్, 75-జడ్చర్ల నియోజకవర్గ ఈఆర్ఓ హరిప్రియ స్వాగతం పలికారు.
అనంతరం రాజాపూర్ మండల కేంద్రంలో తహశీల్దార్/ఏఈఆర్ఓ అధ్యక్షతన పోలింగ్ స్టేషన్లు 111, 112, 113, 114 పరిధిలో ప్రజాప్రతినిధులు, ఓటర్ల సమక్షంలో నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్‌తో కలిసి పద్మజా రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మజా రాణి మాట్లాడుతూ.. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026 ప్రక్రియకు సంబంధించిన పలు కీలక అంశాలను ఓటర్లకు స్పష్టంగా వివరించారు.
ఓటర్లందరూ తమ ఓటు వివరాలను స్వయంగా పరిశీలించుకోవాలని, సమాచారంలో ఏవైనా తప్పులు , అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా ఉండేలా నిర్ధారించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండల తహశీల్దార్/ఏఈఆర్ఓ, రాధాకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

