కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించింది. 2004 జూలైలో రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన 37 కార్పొరేషన్, ఫెడరేషన్ చైర్మన్లు, 11 మంది వైస్ చైర్మన్ల పదవీకాలం ముగియడంతో కొత్త నియామకాలపై కసరత్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న కార్పొరేషన్లతోపాటు మరో 50 వరకు నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేసే దిశగా పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
జిల్లా స్థాయిలో అభిప్రాయ సేకరణ..
జిల్లాలోని పర్యాటక, అటవీ, ఎస్సీ, బీసీ ఫైనాన్స్, గిడ్డంగుల సంస్థ, ఖనిజాభివృద్ధి, మత్స్య, గ్రంథాలయ పరిషత్ తదితర కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయిలో అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు (Mahabubnagar Congress) చెబుతున్నాయి. ఇక గతంలో చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా పనిచేసిన కొందరు మరోసారి అవకాశం కోసం రాష్ట్ర, జాతీయ నాయకత్వం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పదవుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
వారికి ప్రాధాన్యం కల్పించాలి..
పదవులను అనుభవించిన వ్యక్తులకు మళ్లీ అవకాశం కల్పిస్తే అసంతృప్తి పెరిగే అవకాశముందని జిల్లా నాయకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణలు, పార్టీ పట్ల విధేయత, సేవలను ప్రమాణంగా తీసుకుని నియామకాలు చేపట్టే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
సీనియర్లకు అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్..
ఎంతోకాలంగా పార్టీకి సేవలు చేస్తున్న సీనియర్ నాయకులను పారదర్శకంగా గుర్తించి పదవులు కట్టబెట్టాలని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులకు, బీసీ, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు వారి సేవలను గుర్తించి నామినేటెడ్ పదవి ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఆయా జిల్లా పార్టీల అధ్యక్షులు ,స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే కార్యకర్తల మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉండవని పలువురు నేతలు భావిస్తున్నారు.
అదే విధంగా నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: రంగనాథ్ తొలగింపు అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram

