యూడీఎఫ్ టెండర్లపై అసత్య ప్రచారం: సునీల్‌రావు

కలం, కరీంనగర్ బ్యూరో: యూడీఎఫ్ (UDF) పథకం పనులలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకుడు రవీందర్ సింగ్ (Ravinder Singh) చేస్తున్న ఆరోపణలు నిరాధారమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు (Sunil Rao) విమర్శించారు. ఆరోపణలు చేసే ముందు రవీందర్ సింగ్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

కరీంనగర్‌లోని ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన (Sunil Rao) మాట్లాడుతూ, యూడీఎఫ్ పథకంలో రూ.180 కోట్లకు పరిపాలనా అనుమతి లభించగా, వాస్తవ పనుల విలువ రూ.137 కోట్లేనని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు రూ.137 కోట్లతోనే జరుగుతున్నప్పుడు రూ.30 నుంచి రూ.40 కోట్ల అవినీతి ఎలా జరిగిందో వివరించాలని ప్రశ్నించారు.

ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించి ఆమోదించిందని పేర్కొన్న ఆయన, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రవీందర్ సింగ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను అదే నిర్మాణ సంస్థకు అప్పగించారని గుర్తు చేశారు. మిడ్ మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్, తోటపల్లి, మల్లన్నసాగర్, భక్తరామదాసు ప్రాజెక్టులతో పాటు ఇతర పనులను కూడా అదే సంస్థ చేపట్టిందని పేర్కొన్నారు.

అప్పుడు ఎక్సెస్ టెండర్లపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కరీంనగర్‌లో నిర్మాణంలో ఉన్న రూ.546 కోట్ల మానేరు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో కేవలం 4 శాతం ఎక్సెస్ టెండర్ మాత్రమే ఉందని, ఇది ప్రభుత్వ సాంకేతిక నిర్ణయాల ప్రకారమే జరిగిందని తెలిపారు. ఎక్సెస్ టెండర్లను అవినీతిగా చిత్రీకరించడం సరైంది కాదని అన్నారు.

మంత్రి బండి సంజయ్ కుమార్‌పై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సునీల్‌రావు, టెండర్లు, కాంట్రాక్టుల వ్యవహారాలలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ కృషితో కరీంనగర్ నగరాభివృద్ధికి యూసీఎఫ్ పథకం కింద రూ.840 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అవసరమైతే ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని, కానీ ఆధారాలు లేకుండా బీజేపీ నాయకులపై అసత్య ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు వొంటెల సత్యనారాయణ రెడ్డి, వంగల పవన్, బండారి వేణు, కొలిపాక శ్రీనివాస్, పొన్నం మొండయ్యతో పాటు పార్టీ నాయకులు పండుగ నాగరాజు, వాసు, భాస్కర్, హమీద్, రాజ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>