సీతారాంపేట రీసర్వే త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: చిన్నచింతకుంట మండలం సీతారాంపేట గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) పర్యటించి గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులతో పాటు అంగన్‌వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పారిశుద్ధ్య‌ నిర్వహణ, పంట పొలాలను పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరును సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

రీసర్వే పనులు వేగవంతం చేయాలి

గ్రామంలో మొత్తం భూమి విస్తీర్ణం, ఇప్పటివరకు పూర్తయిన సర్వే, ఇంకా పెండింగ్‌లో ఉన్న భూమి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే పనులు అధిక శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించగా, మిగిలిన భూమికి సంబంధించిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వే ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వారికి అవసరమైన అవగాహన కల్పిస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల తనిఖీ

గ్రామంలోని అద్దె భవనంలో రెండు గదులతో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కేంద్రంలో సిబ్బంది, చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర నిర్వహణకు అనువైన ప్రత్యామ్నాయ భవనాలు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతుల నిర్వహణ, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పారిశుద్ధ్య‌ నిర్వహణపై అసంతృప్తి

గ్రామంలో పర్యటించిన కలెక్టర్ మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవడం, విచ్చలవిడిగా చెత్త వేయడం, కాలువల్లో వ్యర్థాలు పడేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య‌ నిర్వహణను మెరుగుపరచాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామసభ నిర్వహించి, మండల పంచాయతీ అధికారుల సమన్వయంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

పంటల సాగుపై రైతులకు సూచనలు

గ్రామంలోని పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సాగు వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలు, కందుల సాగు అవకాశాలు, వర్షాల ప్రభావం, పంట దిగుబడిపై ఆరా తీశారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు విధానాలపై రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దేవరకద్ర మండల పరిధిలో రహదారి పక్కన సాగు చేస్తున్న బంతిపూల తోటలను కూడా కలెక్టర్ పరిశీలించారు. బంతిపూల సాగు విధానం, పంట కాలం, సాగుకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>