గిరిజన పాఠశాలలో మహబూబ్ నగర్‌ కలెక్టర్ తనిఖీలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా శుక్రవారం జడ్చర్ల మండల పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా గిరిజన సంక్షేమ మినీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.. సౌకర్యాలు, పరిసరాలు మొదలు వాటిని పరిశీలించారు. పాఠశాల సిబ్బంది హాజరు రిజిస్టర్, తరగతి గదులు, సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. నాలుగో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారికి రోజూ అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు.

సమస్యలు వివరించిన విద్యార్థులు..

పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ ఖుష్బూ గుప్తా విద్యార్థులను అడిగారు. దోమల సమస్య తీవ్రంగా ఉందని, కొన్ని తరగతి గదుల కిటికీలకు తలుపులు కూడా లేవన్నారు. కొన్ని ఫ్యాన్లు పనిచేయడం లేదని వివరించారు. స్పందించిన కలెక్టర్.. సాయంత్రంలోగా అన్ని ఫ్యాన్లకు మరమ్మతులు చేయడంతో పాటు కిటికీలకు తలుపులు పెట్టించాలని ఆదేశించారు. అలాగే కొత్త ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి తనకు ఫైల్ పంపించాలని సంబంధిత ఆర్‌సీఓను ఆదేశించారు.

జడ్చర్ల ఏరియా ఆసుపత్రి తనిఖీ..

జడ్చర్ల ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. వార్డులు, క్యాజువాలిటీ, లేబర్ రూమ్ తదితర విభాగాలను పరిశీలించారు. చెత్త పేరుకుపోయినట్లు గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోజూ కనీసం మూడు సార్లు శుభ్రపరచాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రసూతి వార్డులో బాలింత మహిళలతో మాట్లాడారు. వైద్య సేవలు, శానిటేషన్, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నాణ్యతతో పనులు చేయాలి..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి పాత బజార్‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులను కలెక్టర్ ఖుష్బూ గుప్తా పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జడ్చర్ల తహసీల్దార్ నర్సింగ్ రావు, మున్సిపల్ కమిషనర్ ఎం.గిరీష్, ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మహమ్మద్ అర్షదుల్లా తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>