డీఈఓ ఆఫీస్ ప్రాంతానికి ‘అంబేద్కర్ సర్కిల్‌’గా నామకరణం: కోమటిరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అంబేద్కర్ సమన్యాయం, సమానత్వం కోసం ఉద్యమించిన మహోన్నత వ్యక్తి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkat Reddy) కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్, డీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యపడిందన్నారు. అంబేద్కర్ అందరి కోసం రాజ్యాంగాన్ని రచించాడని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరివాడని అన్నారు. చదువుతూనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని నిరూపించిన వ్యక్తి అంబేద్కర్ అని అభివర్ణించారు. ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని, డీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని అంబేద్కర్ సర్కిల్‌ (Ambedkar Circle)గా నామకరణం చేస్తున్నానని ప్రకటించారు. డీఎంహెచ్ఓ, డీఈఓ కార్యాలయాలను ఇక్కడి నుంచి కలెక్టరేట్‌కు తరలించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. పానగల్ నుంచి డీఈఓ ఆఫీస్ వరకు రోడ్డు అభివృద్ధి కోసం రూ.15 కోట్లు మంజూరయ్యాయని, మే 2 తేదీ నుంచి ఈ రోడ్డు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల అప్పుడు మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

గతంలో ఎస్సీ, బీసీ, హాస్టల్ ఎస్టీ హాస్టల్లో ఉండేవని, కుల మతాలను రూపుమాపాలనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కూల్’ లను ప్రారంభించిందని గుర్తు చేశారు. నల్గొండలోని ఎస్ఎల్‌బీసీ యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, దోమలపల్లిలో త్వరలోనే మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళా భారత్‌కు నిధులు కేటాయించి సౌండ్ సిస్టంతో పాటు ఇతర ఎలాంటి అభివృద్ధి పనులు ఉన్నా పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. తాను నల్లగొండలోని ప్రకాశం బజార్‌లో సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోట్టుగూడ స్కూల‌్‌లో అడ్మిషన్లు వేల సంఖ్యలో వచ్చాయని, ఇదే స్థాయిలో మరికొన్ని పాఠశాలలను ఏర్పాటు చేస్తానని తెలిపారు. నేటి యువత, విద్యార్థులు అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు తాను ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Read Also: ఫుట్‌బోర్డ్ ప్రమాదాలకు గుడ్​బై.. క్లోజ్డ్ డోర్ నాన్ ఏసీ రైలు వచ్చేస్తోంది!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>