కలం, ఖమ్మం బ్యూరో : జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగటిపూట కార్లలో తిరుగుతూ రెక్కీ నిర్వహించి.. రాత్రి పూట తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా భారీ చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును (Khammam Theft Gang) ఖమ్మం సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ప్రధాన నాయకుడితో పాటు మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఖమ్మం సీసీఎస్ ఏసీపీ ఎండీ సర్వర్, ఇన్స్పెక్టర్ ఎస్. రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గత ఐదు నెలలుగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని వైరా, ఏన్కూరు, కల్లూరు, కారెపల్లి, కురవి, మహబూబాబాద్ ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ ఈ ముఠా వరుస దొంగతనాలకు పాల్పడుతోంది. వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దొంగల ముఠాలోని ఇద్దరు నిందితులు వేములవాడ జీవన ప్రకాష్, పాయం నవీన్ లను పోలీసులు ఇటీవలె అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కాగా, పరారీలో ఉన్న ఈ ముఠా నాయకుడు చల్లా వెంకటేశ్వర్లును బుధవారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి విలువైన వస్తువులను రికవరీ చేసి, తదుపరి చర్యల నిమిత్తం వైరా పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
నిందితుల నుంచి ఒక హుండై కారుతో పాటు యాభై గ్రాముల బంగారం ఆభరణాలు, నాలుగు వందల గ్రాముల వెండి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు పగటి పూట కారులో తిరుగుతూ ఏయే ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయో పరిశీలించి రెక్కీ నిర్వహించేవారని, రాత్రి సమయాల్లో ఆ ఇళ్లలో చొరబడి బంగారం, వెండి వస్తువులను దోచుకునేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ దొంగసొత్తులో కొన్నింటిని బయట మార్కెట్లో అమ్ముకుని వారు విలాసవంతమైన జీవితం గడిపినట్లు తెలుస్తుంది. అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకోవడంలో చొరవ, ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఏసీపీ ఎండీ సర్వర్, ఇన్స్పెక్టర్ ఎస్. రాజ్ కుమార్ గౌడ్, పోలీస్ సిబ్బందిని అడిషనల్ డీసీపీ రామానుజం ప్రత్యేకంగా అభినందించారు.

