కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలతో కార్పొరేషన్లకు రిజర్వేషన్లు(reservations) ఖారారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలో రామగుండం, కరీంనగర్ రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. రెండు కార్పొరేషన్లలో కరీంనగర్ కార్పొరేషన్ ను బీసీ జనరల్ కేటాయించగా, రామగుండం కార్పొరేషన్ ను ఎస్సీలకు కేటాయించారు.
చొప్పదండి, హుజూరాబాద్ మున్సిపాలిటీలను ఎస్సీ మహిళకు కేటాయించగా జమ్మికుంట మున్సిపాలిటీని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. జగిత్యాల మున్సిపాలిటీ బీసీ మహిళకు కేటాయించగా పెద్దపల్లి, మంథని, వేములవాడ బీసీ జనరల్ అభ్యర్ధులకు కేటాయించారు. కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళకు కేటాయించగా మెట్‌పల్లి, రాయికల్‌ను జనరల్ అభ్యర్ధులకు కేటాయించారు. సుల్తానాబాద్ జనరల్ అభ్యర్ధులకు కేటాయించగా సిరిసిల్ల జనరల్ మహిళకు కేటాయించారు. రిజర్వేషన్లు ఫైనల్ కావడంతో ఈసారి ఇప్పటి వరకు చైర్మన్, మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు అభ్యర్ధులకు నిరాశ తప్పలేదు. రిజర్వేషన్లతో మేయర్, చైర్మన్ అభ్యర్ధుల కోసం కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.


