Mobile Popup Ad
Mobile Popup Ad

రైతులపై కేసుల ఆరోపణలు అవాస్తవం: కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్

కలం, కరీంనగర్ బ్యూరో: రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ, నియోజకవర్గ రైతులను తన కుటుంబసభ్యులుగా భావించి చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఎంతో క‌ష్ట‌ప‌డి పని చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్(Karimnagar Congress) కార్యాలయంలో జిల్లా పార్టీ బీసీ సెల్ (BC Cell) చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ నియోజకవర్గానికి చెందిన పలువులు నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎమ్మెల్యే సత్యంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఇటీవ‌ల‌ అర్ధరాత్రి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే ఉండి, మానవత్వంతో రైతుల బాధను అర్థం చేసుకొని స్వయంగా లారీ ఎక్కి ధాన్యం తరలింపును పర్యవేక్షించార‌న్నారు. సుంకె రవిశంకర్ లారీ ఎక్కి వస్తావా.. బస్సు ఎక్కి వస్తావా అంటూ పాటలు పాడుతూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని వారు విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో “అన్నా మాకు నీళ్లు కావాలి” అని రైతులు అడిగితే.. “ఈ ఏడాది రాళ్ల వాన పడి పంట కొట్టుకుపోయిందని అనుకోండి” అని నాటి సీఎం, నాటి మంత్రులు మాట్లాడటం వల్ల రైతులు ఎంతగానో ఆవేదన చెందారని గుర్తు చేశారు.

ఎమ్మెల్యే స‌త్యం గంగాధరకు డిగ్రీ కళాశాల మంజూరు చేశారని, ఆర్నకొండ నుండి మల్యాల వరకు రోడ్డు నిర్మాణం, కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.36 కోట్లు మంజూరు చేయించార‌ని చెప్పారు. నారాయణపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం ఘటనలో ఎమ్మెల్యే సత్యంను టార్గెట్ చేస్తూ, రైతులపై కేసులు పెట్టారని సుంకె రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఖండించారు. పూడూరు, గంగాధరలో ధర్నాలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైనా కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. వరద కాలువ విషయంలో నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి ముంపు బాధితులకు పరిహారం అందించాలని, చుక్కనీరు వృధా కాకుండా చూడాలని సత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో గంగాధర మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్, మాజీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, తాడి జెర్రీ సర్పంచ్ రామిడి రాజిరెడ్డి, నాయకులు రుద్ర మల్లేశం, సాయిని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>