కలం, కరీంనగర్ బ్యూరో: మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా మానుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కరీంనగర్ (Karimnagar) జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి నగరంలోని అశోక్‌నగర్‌లో ఉన్న మాదకద్రవ్యాల, మద్యపాన వ్యసన విముక్తి కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పునరావాస కార్యక్రమాలపై కలెక్టర్ ఆరా తీశారు. చికిత్స పొందుతున్న బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్స పురోగతిని తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స పూర్తిగా కొనసాగించి మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని శాశ్వతంగా మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, నాగేశ్వరరావు, కేంద్ర నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

