కలం, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానికంగా జరిగిన టీడీపీ సీనియర్ నాయకుడు సంజీవరెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) హాజరయ్యారు. ఇదే వేడుకకు సంజీవరెడ్డి సోదరుడు వైసీపీ నేత శ్రీరామ్‌రెడ్డి, మంత్రి జనార్దన్ రెడ్డి, వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి కూడా వచ్చారు. అయితే వేడుకలో శ్రీరామ్‌రెడ్డిని చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నువ్వెందుకు పెళ్లికి వచ్చావంటూ వాగ్వాదానికి దిగారు. తక్షణమే పెళ్లి వేడుక నుంచి వెళ్లిపోవాలని అరిచారు. ఈ గొడవ కాస్తా పెళ్లి మండపంలోనే కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి జేసీ వర్గీయులు పెళ్లి మండపం వద్దకు చేరుకొని నానా హంగామా చేశారు. హనుమంత్ రెడ్డి కారుపై రాళ్ల దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కళ్యాణ మండపానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు భారీ భద్రత నడుమ శ్రీరామ్ రెడ్డి కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

