కలం, హనుమకొండ : ఎల్నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ (Jayaprakash Narayan) సూచించారు. రాజకీయ విమర్శలకు తావివ్వకుండా అఖిలపక్ష నేతలు, మేధావుల సూచనలతో నీటి సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని కోరారు.
హనుమకొండలోని లోక్సత్తా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జయప్రకాష్ నారాయణ (జేపీ) మాట్లాడారు. గోదావరి, ప్రాణహిత నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకుని రిజర్వాయర్లను నింపాలన్నారు. తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వసూలవుతున్న పన్నుల ఆదాయాన్ని అనవసర ఖర్చులకు వెచ్చించకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని జేపీ (Jayaprakash Narayan) సూచించారు.
రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.42 వేల కోట్లకు పెరిగిందని జయప్రకాష్ నారాయణ చెప్పారు. ఆ నిధులను ప్రజల అవసరాలకు ఎలా వినియోగిస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. యువత మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని జయప్రకాష్ కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవకులేనని, యజమానులు కాదని స్పష్టం చేశారు.
రాజకీయ, ఎన్నికల సంస్కరణలతో పాటు న్యాయ, పోలీసు వ్యవస్థల్లో సంస్కరణలు అమలు చేసినప్పుడే ప్రజాస్వామ్య విలువలు బలోపేతమవుతాయని జేపీ పేర్కొన్నారు. సమావేశంలో లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర ప్రధాన సలహాదారు పర్చా కోదండ రామారావు, ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహనరావు, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

