కలం, జడ్చర్ల: రాబోయే రోజుల్లో కరువు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి (MLA Anirudh Reddy) అన్నారు. సోమవారం జడ్చర్ల (Jadcherla) నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ఆయన పర్యటించి ఏర్పాటు చేసిన సమావేశాలలో మాట్లాడారు.
రాజా పూర్, కల్లేపల్లి, ఈద్గాన్‌పల్లి, మల్లేపల్లి, ముదిరెడ్డిపల్లి, రాయపల్లి గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. యారోన్ పల్లి తండాలో సీసీ రోడ్డు ప్రారంభించి, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. బాలానగర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాజాపూర్‌లో రూ.42 కోట్లతో ఏటీసీ సెంటర్ మంజూరు చేయించామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ ఫలాలు మరింత పారదర్శకంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం గుర్తింపు కార్డులు మాత్రమే కాకుండా, పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే ముఖ్యమైన సాధనాలని పేర్కొన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రాజాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు.
ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికే పరిమితం కాకుండా, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని తన బాధ్యతగా భావించి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. బాలానగర్ మండలాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నవోదయ పాఠశాల ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు, రాజాపూర్ మండలంలో ఏటీసీ (ATC) సెంటర్‌కు రూ.42 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగిందని గుర్తుచేశారు.
విద్య, ఉపాధి అవకాశాలను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేస్తూ, జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం రానున్న వేసవి పరిస్థితులపై మాట్లాడుతూ.. దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, వచ్చే వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ముఖ్యంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అన్ని గ్రామాల సర్పంచులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాజాపూర్ మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.

