కలం, నల్గొండ: నల్గొండలో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ (AIKS Conference) 36వ జాతీయ మహాసభ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజా ఉద్యమ నాయకులు, రైతు నేతలు, మేధావులు, అమరవీరుల మృతికి సోమవారం సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మహాసభలో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంలో పలువురు ప్రముఖుల సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించింది.
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా, మార్క్సిస్టు మేధావిగా విశేష సేవలందించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, ఏఐకేఎస్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు ఎన్. శంకరయ్య, ప్రముఖ రైతు నాయకుడు సరంపల్లి మల్లారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసింది. వీరితోపాటు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమానికి సేవలందించిన మదన్ ఘోష్, జి.సి. బయ్యారెడ్డి తదితర నాయకులను స్మరించుకుంది.
కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు బసుదేవ్ ఆచార్య, సునీత్ చోప్రా, కనై బెనర్జీ, ఎం.ఎం. లారెన్స్ తదితరుల మృతికి కూడా సంతాపం ప్రకటించింది. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్గొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి, ఏఐకేఎస్ నేత అతుల్ కుమార్ అంజన్, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్, శాస్త్రవేత్త ఎం.పి. పరమేశ్వరన్, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా సహా పలువురు మేధావులు, కళాకారులు, ప్రముఖులకు నివాళులర్పించింది.
గాజా, పాలస్తీనా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో యుద్ధాలు, ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులు, దేశంలోని మత, కుల హింసలో ప్రాణాలు కోల్పోయినవారిని స్మరించుకుంది. అప్పుల బాధలు, ప్రభుత్వ విధానాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, వ్యవసాయ కార్మికులు, యువతకు నివాళులర్పించింది. వాయనాడ్ కొండచరియల విపత్తుతోపాటు వరదలు, తుఫానులు, భూకంపాల్లో మరణించినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. రైతు, ప్రజా ఉద్యమాల కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు కామ్రేడ్ సామినేని రామారావు, సుభాష్ ముండా, బాదల్ శీల్, ఆనంద్ దేవ్ సంగ్వాన్, అనరుల్ ఇస్లాం తదితరులను స్మరించుకుంది. దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాల్లో అమరులైన వారందరికీ మహాసభ ఘనంగా నివాళులర్పించింది.

