కలం, వెబ్ డెస్క్: భారత సరికొత్త ఆర్చేరీ సంచలనం, 17 ఏళ్ల ప్రితిక ప్రదీప్ (Prithika) అంతర్జాతీయ సీనియర్ వేదికపై అదరగొట్టింది. మాడ్రిడ్‌లో జరుగుతున్న ఆర్చేరీ వరల్డ్ కప్ స్టేజ్-4 లో శనివారం ఆమె ఏకంగా రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన ప్రితిక, ఆ తర్వాత టీమ్ ఈవెంట్‌లో భారత్ రజత పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆదివారం జరగబోయే రికర్వ్ ఈవెంట్లలో భారత్‌కు మరో రెండు పతక అవకాశాలు ఉండటంతో అందరి కళ్లూ ఆ పోటీలపైనే ఉన్నాయి.
ఈ టోర్నీలో ప్రితిక ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా ఆర్చేరీ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన ఆమె, ఇప్పుడు తన మొదటి వరల్డ్ కప్‌లోనే అద్భుత ఫామ్‌ను కొనసాగించింది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత సెమీఫైనల్లో మలేషియాకు చెందిన ఫాతిన్ నూర్ఫాటెహా చేతిలో 142-144 తేడాతో ప్రితిక తృటిలో ఓడిపోయింది. అయితే, ఆ వెంటనే జరిగిన కాంస్య పతక పోరులో మాత్రం ఆమె అస్సలు తగ్గలేదు. టర్కీకి చెందిన హజాల్ బురున్‌పై 145-142 తేడాతో ఘన విజయం సాధించి, తన తొలి వరల్డ్ కప్ వ్యక్తిగత పతకాన్ని ముద్దాడింది.
వ్యక్తిగత పోటీలకు ముందే టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. అర్హత రౌండ్‌లో 1024 పాయింట్లతో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరింది. దారిలో డెన్మార్క్, ఆతిథ్య స్పెయిన్, బలమైన కొరియా జట్లను మట్టికరిపించింది. శనివారం ఉదయం జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ప్రితిక, సీనియర్ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం, చికిత తనిపర్తిలతో కూడిన భారత బృందం 228-232 తో టాప్ సీడ్ కొలంబియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.
మరోవైపు పురుషుల విభాగంలో భారత్‌కు పతకాలు తృటిలో చేజారాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నం తిరుమురు, కుశాల్ దలాల్ బృందం సెమీఫైనల్లో మెక్సికో చేతిలో షూట్-ఆఫ్‌లో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లోనూ జర్మనీ చేతిలో 232-233 తో ఒకే ఒక్క పాయింట్ తేడాతో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ కూడా క్వార్టర్ ఫైనల్లో మెక్సికో చేతిలో షూట్-ఆఫ్‌లోనే ఓడి వెనుదిరిగింది. వ్యక్తిగత విభాగంలో రిషభ్ యాదవ్ క్వార్టర్స్ చేరగా, మిగిలిన ముగ్గురు మూడో రౌండ్‌లోనే నిష్క్రమించారు.

