కలం, వెబ్డెస్క్: రాష్ట్రంలో మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు అడ్డదారుల్లో రవాణా, వినియోగం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతూ, ఇంటి నుంచే గంజాయి అమ్ముతున్న ఓ బీటెక్ స్టూడెంట్ (BTech Student) ను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి జోన్ ఎస్ఓటీ టీమ్-1, జవహర్నగర్ పోలీసులు సంయుక్తంగా సదరు యువకుడి ఇంటిపై దాడులు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న బీటెక్ విద్యార్థిని అరెస్ట్ చేశారు. జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్, సంతోషి నగర్ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచడంతో పాటు, బయటి నుండి ఎండు గంజాయిని తెప్పించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు రెండు అడుగుల ఎత్తున్న 2 గంజాయి మొక్కలు, 4 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్ నెట్వర్క్ వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారులు, ఇతర వ్యక్తులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని మల్కాజిగిరి పోలీసులు వెల్లడించారు. మత్తుపదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, డ్రగ్స్ రహిత సమాజం కోసం కఠిన చర్యలు, నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడైనా డ్రగ్స్ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

