నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

కలం, వెబ్ డెస్క్: ఏపీలో కొత్త పెన్షన్ల ప్రక్రియ నడుస్తున్న వేళ చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘నేతన్న భరోసా’ (ఎన్టీఆర్ భరోసా) పెన్షన్ (Nethanna Bharosa) పథకానికి అప్లై చేసే దరఖాస్తులో కీలక నిబంధనలు మినహాయిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. నేతన్నలు బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌కు బదులుగా సంబంధిత మాస్టర్ వీవర్ (సొసైటీ/యజమాని) ఇచ్చే  సర్టిఫికెట్ తో పాటు వేతన వివరాల పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు.

50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ తప్పకుండా పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి, వారి ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

నేతన్నలకు బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధనతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాస్టర్ వీవర్ దగ్గర పనిచేసే చేనేతలకు వ్యక్తిగతంగానే వేతనాలు చెల్లిస్తారు. వీరికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేయడం ఉండదు. అటువంటి సమయంలో బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధన పెట్టడంతో చేనేతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని నేతన్నలు, చేనేత సంఘాల ప్రతినిధులు మంత్రి సవితకు విన్నవించారు. తక్షణమే స్పందించిన మంత్రి.. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల పరిశీలన అనంతరం బ్యాకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధనను సడలించాలని సీఎం నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని మంత్రి సవిత ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>