కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాలను, ఆయా ప్రభుత్వాలను తమ కబంద హస్తాల్లో పెట్టుకోవడానికి అనేక అడ్డదారులు తొక్కుతుందని, బెదిరింపులకు పాల్పడుతుందని, కార్పొరేట్ శక్తులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ఆరోపించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు నిర్వహిస్తున్న సీపీఐ ప్రచార జాత ఐదవరోజు గన్నేరువరం(Ganneruvaram) మండలంలో పర్యటిచ్చింది.
ఈ ప్రచార జాతా కార్యక్రమాలకు సీపీఐ గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలవేన శంకర్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలని తీసుకువస్తే దేశంలోని రైతులంతా ఏకమై అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించారని.. ఆ మహత్తర పోరాటంలో 750 మందికి పైగా రైతులు మృతి చెందారని చెప్పారు. ఆ పోరాటాలకు బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని, దీంతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు క్షమాపణ చెప్పే దుస్థితికి బీజేపీ పాలన దిగజారిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీసం మద్దతు ధర చట్టం అమలు చేయడంలో వైఫల్యం చెందిదని మండిపడ్డారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, పోరాడి సాధించుకున్న మహిళా రిజర్వేషన్ అమలు చేయడం లేదని, కార్మిక హక్కులను చట్టాలను రద్దు చేస్తూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందనంత దూరంలో విద్య, వైద్యం ఉందన్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో కేంద్రం కీలుబొమ్మలుగా మారిపోయిందని, పెట్టుబడిదారుల చేతుల్లో వ్యాపారమైందని ఫైర్ అయ్యారు. జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని, అన్ని రోగాలకు సంబంధించినటువంటి డాక్టర్ల కొరత ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం పోస్టుమార్టం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయన్నారు.
అటు మండల కేంద్రాల్లో ఆసుపత్రులు నిర్మించి నలుగురు వైద్యులను ఏర్పాటు చేస్తామని పాలకులు చెప్పారని, నలుగురు కాదు కదా ఒక్క డాక్టర్ కూడా గతీ లేదని, ఆస్పత్రులు కూడా నిర్మించలేని దుస్థితి నెలకొన్నదని.. కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు. విద్యార్థి ఉద్యమాలైన, యువజన నిరుద్యోగ సమస్యపై పోరాటాలైన, రైతాంగ వ్యతిరేక విధానాలైన ఏ ఉద్యమాలైనా ఢిల్లీ నడిబొడ్డున పెద్ద ఎత్తున నిర్వహించకపోతే బీజేపీ ప్రభుత్వానికి చలనం కలగడం లేదని చెప్పారు. దేశంలో మార్పు కావాలని సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కమ్యూనిస్టులు, ప్రజలు సెప్టెంబర్ 1న ఢిల్లీలో కదం తొక్కాలని ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున తరలిరావాలని శంకర్ పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగాన్ని కూనీ చేస్తుందని, డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన హక్కులు, చట్టాలు అమలు చేయడంలేదని, అర్హులైన పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశ భవిష్యత్ ను కాపాడుకోవడానికి ప్రజలంతా ఉద్యమాల వైపు పయనించాలన్నారు.
జాతా లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జాతా కో ఆర్డినేటర్స్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్,గూడెం లక్ష్మీ, నాగెల్లి లక్ష్మారెడ్డి, సీపీఐ గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కాల్ల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, బీర్ల పద్మ, కొట్టె అంజలి, మండల సహాయ కార్యదర్శులు కూన మల్లయ్య, పిప్పళ్ల కనుకయ్య భవన నిర్మాణ సంఘం మండల కార్యదర్శి మైసంపల్లి మల్లేశం, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శులు బోయిని తిరుపతి, బోయిని మల్లయ్య, చెరుకు ఆంజనేయులు, గాజుల లక్ష్మణ్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మోలుగురి ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ముల్కల పవన్ నాయకులు ఎండీ నయీమ్, బొమ్మకంటి ఆంజయ్యచారి, రమేష్, మీసం లక్ష్మణ్ , గోపయ్య, యాదగిరి రాజయ్య, సంతోష్ చారి, బీర్ల స్వాతి, స్వప్న, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

