కలం, ఖమ్మం బ్యూరో : ఆర్టీసీ బస్టాండ్‌ను ఒక్కసారిగా దట్టమైన పొగ ముంచెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్టీసీ బస్టాండ్ (Yellandu RTC Bus Stand ) లోని కంట్రోలర్ గదిలో శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఫ్యూజ్ బాక్స్ నుంచి షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
గది నుంచి మంటలు చెలరేగి బస్టాండ్ ఆవరణమంతా పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు పరుగులు తీశారు. అయితే, కంట్రోలర్ రాజేశ్వర్ రావు తక్షణమే స్పందించి బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అనంతరం డిపో సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలను అదుపులోకి తెచ్చారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

