కలం, వెబ్‌డెస్క్: భారత్ జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విజయం వెనుక అతని తండ్రి చేసిన పెద్ద త్యాగం ఉంది. తన కుమారుడి క్రికెట్ కలను నిజం చేయడానికి సంజీవ్ సూర్యవంశీ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని అమ్మేశాడు. వైభవ్ చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ప్రత్యేక ప్రతిభ చూపించాడు. అతడికి మెరుగైన శిక్షణ అందించేందుకు సమస్తిపూర్ నుంచి పాట్నా వరకు తరచూ తీసుకెళ్లేవారు. ఈ ప్రయాణాలు, శిక్షణ ఖర్చుల కోసం భూమి అమ్మిన డబ్బును వినియోగించారు.
ఆ కష్టం ఇప్పుడు ఫలించింది. ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్, అండర్-19 ప్రపంచకప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. తన కుమారుడి విజయాల ముందు భూమి, డబ్బు విలువ ఏమాత్రం లేదని సంజీవ్ తెలిపారు. దేశం కోసం ఆడాలనే కలతో వైభవ్ చిన్నప్పటి నుంచే కష్టపడ్డాడని, ఇప్పుడు ఆ అవకాశం రావడం కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

