కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల వేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫొటో లేదనే అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao)కు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది. అయితే, ఆ లేఖ నకిలీదని బీఆర్ఎస్ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆ లేఖ కాంగ్రెస్ సృష్టించిన నకిలీదని ఆరోపిస్తున్నాయి. పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు చూపించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నాయి. ఆ లేఖను ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
లేఖలో ఏముంది..?
సిద్దిపేట (Siddipet) జిల్లా దశాబ్ది ఉత్సవాల వేదికపై బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫొటోను ఉంచకపోవడంతో పాటు గతంలోనూ జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao)కు బిఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ వ్యవహారాల ఇన్ చార్జి సోమ భరత్ కుమార్ ఈ నోటీసు అందించినట్లుగా ఉంది. నోటీసు అందిన 10 రోజుల్లోగా హరీష్ రావు లిఖితపూర్వక వివరణ ఇస్తూ కేసీఆర్ ముందు హాజరుకావాలని, సరైన వివరణ ఇవ్వని పక్షంలో ముందస్తు హెచ్చరికలు లేకుండానే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆ లేఖలో స్పష్టం చేశారు.
కేటీఆర్ ప్రాధాన్యతపై చర్చ
సిద్ధిపేట నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ కార్యక్రమం నిర్వహించినా అధినేత కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఫొటోలు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తుంటాయని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధించిన ఫొటోలు కనిపించవని పలువురు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు ఉంటుందని ప్రచారం ఉన్నది. పార్టీ పరంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు, ఇతర ముఖ్య కార్యక్రమాలప్పుడు నామమాత్రంగా, తప్పదు అనుకుంటే తప్ప కేటీఆర్ ఫోటో పెట్టే పరిస్థితి ఉండదని ఆరోపణలు ఉన్నాయి.
కుట్రలో భాగంగానే ..
తాజాగా ప్రచారంలోకి వచ్చిన షోకాజ్ నోటీసు లేఖ అవాస్తవమని.. అది ఫేక్ లెటర్ అని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చౌకబారు రాజకీయం చేస్తూ.. ఫేక్ లెటర్స్‌ను ప్రచారంలోకి తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని, దీంతో తప్పుడు ప్రచారాల కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారు. ఫేక్ లెటర్‌ను ప్రచారం చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను సైతం ఆశ్రయించారు.
Also Read : పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు.. పార్టీల ప్రచార హోరు!
Follow Us On: Instagram

