పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు.. పార్టీల ప్రచార హోరు!

కలం, ఖమ్మం బ్యూరో: ​తెలంగాణ రాజకీయాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections)తో ఉత్కంఠభరిత పోరుకు తెరలేచింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై అన్ని పార్టీలు గురిపెట్టాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుండటంతో ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌తో పాటు జనసేన, పలు పార్టీలు, స్వతంత్రులు వ్యూహాలకు పదును పెడుతూ ప్రచారంలో జోరు పెంచాయి.

7 లక్షలకు పైగా పట్టభద్రుల ఓట్లు..

ఉమ్మడి మూడు జిల్లాల(ఖమ్మం, నల్గొండ వరంగల్) పరిధిలో దాదాపు 7 లక్షలకు పైగా పట్టభద్రుల ఓట్లు ఉన్నట్ల అంచనా. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరితో ఓటు నమోదు చేయించేందుకు రాజకీయ పార్టీలు శ్రమిస్తున్నాయి. నిరుద్యోగులు, పట్టభద్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. ఓటర్ల నమోదు ప్రారంభమైన నాటి నుంచే ప్రతి పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. క్షేత్రస్థాయిలో యువతతో ప్రత్యేక సమ్మేళనాలు, ఆత్మీయ సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

​కాంగ్రెస్ ముందస్తు వ్యూహం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్ధులను ప్రకటించి సరికొత్త వ్యూహానికి తెరతీసింది. ఈ మూడు జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (Ramreddy Sarvotham Reddy) బరిలో నిలవగా, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు, ప్రముఖ నేతలు ఒకే వేదికపైకి వచ్చారు.

ఇటీవల ఖమ్మం వేదికగా జరిగిన భారీ సన్నాహక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలు, పెండింగ్ బకాయిల పరిష్కారాన్ని వివరిస్తూ.. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే సర్వోత్తమ్ రెడ్డి ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్ దృష్టి..

ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను తేలికగా తీసుకోవడం లేదు. ఇప్పటి వరకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకుండా వ్యూహత్మకంగా వ్యవహారిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి (Anugula Rakesh Reddy) ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ఎండగడుతూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రధానాస్త్రంగా మలుచుకుని పట్టభద్రులను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ప్రధాన పార్టీలతో పోటీగా..

ఎమ్మెల్సీ పోరు కేవలం ప్రధాన పార్టీలకే పరిమితం కాకుండా మరింత ఆసక్తికరంగా మారుతోంది. జనసేన పార్టీ తరఫున గడల శ్రీనివాసరావు ముందుగానే రంగంలోకి దిగి ఖమ్మం కేంద్రంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ప్రస్తుత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా మూడు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండటం విశేషం. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పాలకూరి అశోక్ కుమార్ నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తూ.. వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణగా..

​పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక (Graduate MLC Elections) కేవలం అభ్యర్థుల గెలుపోటములకే పరిమితం కాకుండా.. రాజకీయ సమీకరణాలు, అధికార పక్షం పాలనా తీరుకు ఇది అసలైన ప్రజాభిప్రాయ సేకరణగా మారనుంది. పార్టీల జెండాలు, అజెండాల కంటే విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయనేది రసవత్తరంగా మారింది. సంక్షేమ హామీలతో అధికార పక్షం దూసుకుపోతుంటే, క్షేత్రస్థాయి వ్యూహాలు, ప్రజా సమస్యల అస్త్రాలతో ప్రతిపక్షాలు హోరెత్తిస్తున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరి ఖాతాలో చేరుతుంది? రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు ఉత్కంఠ ఏ స్థాయికి వెళ్తుంది? మొత్తానికి, రాజకీయ పార్టీల వ్యూహాల పదునుకు, పట్టభద్రుల చైతన్యానికి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Also Read : బెంగళూరు పబ్‌ వివాదం.. ఐఏఎస్ అధికారి బదిలీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>