కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (Yadadri Thermal Power Station) స్టేజ్-1 లో తీవ్ర కలకలం రేగింది. బాధ్యతల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించారనే ఆరోపణలతో వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్కు గురయ్యారు. ఇంధన శాఖ (ఎనర్జీ సెక్రటరీ) ప్రత్యేక ఆదేశాల మేరకు జెన్కో సీఎండీ హరీష్ ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 800 మెగావాట్ల యూనిట్-1 గత 10-15 రోజులుగా ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి లేకుండా షట్ డౌన్ అయి ఉంది. అయితే దీనివల్ల సంస్థకు భారీ స్థాయిలో జనరేషన్ లాస్ (ఉత్పత్తి నష్టం) వాటిల్లింది. సిబ్బందిని సమన్వయం చేయడంలో, నిత్య సమీక్షలు నిర్వహించడంలో, పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయడంలో చీఫ్ ఇంజనీర్ పూర్తిగా విఫలమైనట్లు అధికారులు గుర్తించారు.
కేవలం యూనిట్ షట్ డౌన్ మాత్రమే కాకుండా, గత నెలలోనూ పలు లోపాలు వెలుగుచూశాయి. డిఈ స్థాయి అధికారి లైట్ డిస్టిలేట్ ఆయిల్ స్టాక్ను సక్రమంగా నిర్వహించకపోవడం, యూనిట్ స్టార్ట్ చేసే సమయంలో ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రం(Yadadri Power Station)లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఉన్నతాధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read : బెంగళూరు పబ్ వివాదం.. ఐఏఎస్ అధికారి బదిలీ!
Follow Us On: Youtube

